కాల్మొక్తం.. కరెంట్ లైన్ మార్చండి..అధికారులను వేడుకున్న  ఒడ్డెర కాలనీ వాసులు

కాల్మొక్తం.. కరెంట్ లైన్ మార్చండి..అధికారులను వేడుకున్న  ఒడ్డెర కాలనీ వాసులు

శాయంపేట మండలం, వెలుగు: హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఇండ్లపై నుంచి వేస్తే తమ ప్రాణాలకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తూ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలోని ఒడ్డెర కాలనీ వాసులు బుధవారం అధికారుల కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. గతంలో కాలనీ వెనుకవైపు నుంచి వెళ్లిన 11కేవీ లైన్ కింద ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంతో ప్రమాద పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలో ఒకరికి విద్యుత్ షాక్ తగలడం కలకలం రేపింది. దీంతో లైన్‌‌‌‌ను అక్కడి నుంచి తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, రూ.5.80 లక్షలతో కొత్త లైన్‌‌‌‌కు నిధులు మంజూరయ్యాయి. అయితే అధికారులు హైవే రోడ్డు పక్కనుంచి లైన్ వేయడానికి స్తంభాలు ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు అభ్యంతరం తెలిపారు. బుధవారం వైర్లు లాగేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగితే విద్యుత్ లైన్ ఇండ్లపై నుంచి వెళ్తుందని, అధికారులు తమ విజ్ఞప్తి వినిపించుకోవాలని కాలనీ వాసులు వేడుకున్నారు. ప్రాణాలకు హాని కలగదని రాతపూర్వక హామీ ఇస్తేనే పనులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఎంత చెప్పినా కాలనీవాసులు వినకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.